By M S R ...July 28, 2020
…. అసలు జగన్ ఎప్పుడు మారతాడో ఏమో… అరె, మా చంద్రబాబు ఇంతగా చెబుతున్నాడు… మా రాధాకృష్ణ చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాడు… మా టీవీ5 నాయుడు కూడా చెబుతూనే ఉన్నాడు… ఇంకెప్పుడు మారతాడు..? అబ్బే… ఇలాగైతే కష్టం బాసూ… పదుగురాడుమాట పాడియై ధర చెల్లు అన్నారు పెద్దలు… పది మందీ చెబితే వినాలి కదా… పోనీ, పాలనలో నీ గురువు అని భావించే కేసీయార్‌ను చూసైనా నేర్చుకోవాలి కదా… చూసి కూడా నేర్చుకోకపోతే ఏమనాలి అసలు..?
సరే, హైకోర్టు ప్రతి విషయంలోనూ అక్షింతలు వేస్తోంది… ప్రతి కేసులోనూ వ్యతిరేక తీర్పు వస్తోంది… దానికి కారణాలు ఏమిటో తెలిసి, సెట్ చేసుకోవాలి తప్ప… అయ్యో, హైకోర్టులో ఏమిటీ ఎదురు దెబ్బలు, సుప్రీంలోనూ తప్పని అక్షింతలు అనుకుని వాస్తు పండితులను ఆశ్రయిస్తే ఎలా…? సరే, వెళ్లావు, ఎవరి వాస్తు సలహాలు పాటించాలో మీ రాజగురువు స్వరూపుడిని అడిగావా..? అడగకపోతివి… ఆయనకేమో వాస్తు తెలియదాయె… ఎవరో ఒకరి పేరు చెప్పేవాడుగా… లేకపోతే ఏ రాజశ్యామల యాగమో చేయించేసి, మమ అనిపించేవాడు కదా…
సరే, ఎవరో ఏదో చెప్పారు… అసలు ఉన్న దోషమల్లా నీ సచివాలయ భవనంలోనే ఉంది అని చెప్పాడు సరే… అది ఆయన చెప్పేది ఏముంది..? చినుకు కురిస్తే జలపాతం కనిపించే నీ పాత అసెంబ్లీ ఛాంబరే చెబుతోంది కదా సచివాలయం, అసెంబ్లీ భవనాలు ఫుల్ వాస్తు దోషపూరితమని… గేట్లు మూసెయ్, ఇక నరుడి దృష్టి తగ్గిపోతుంది అన్నాడే అనుకో ఆ వాస్తుసిద్ధాంతి… జస్ట్, అలా రెండు గేట్లు మూసేస్తే చాలా..? అసలు వాస్తు దోష నివారణ అంటే ఎలా ఉండాలి..? థింక్ బిగ్ బాసూ…
ముందుగా ఆ అసెంబ్లీ భవనమే సర్వారిష్టాలకూ మూలం అని ముద్రేయాలి ముందుగా… దోష సచివాలయం సకలపాప కారకం అని చెప్పాలి… చెప్పించాలి… దాన్ని గత పాత దుష్ట, నికృష్ట పాలనకు ప్రతీకగా సాక్షిలో నాలుగు పవర్ ఫుల్ వ్యాసాలు రాయించాలి… వీలయితే సాక్షి టీవీలో పదీపన్నెండు డిబేట్లు రన్ చేయాలి… అసెంబ్లీ, సచివాలయం వాస్తు బాగాలేకపోతే ప్రజలకు ఎంత అరిష్టమో ఎస్టాబ్లిష్ చేయాలి… ఆ తరువాత ఫైర్ ఎక్విప్‌మెంట్ బాగా లేదని, వెంటిలేషన్ సరిగ్గా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే గౌరవనీయులైన సభ్యులకు, అధికార్లకు, ప్రజకు ఎంత కష్టం అనే ఆందోళనను రేకెత్తించాలి…
అప్పుడు కూల్చివేతకు పూనుకోవాలి… దాన్నీ హైకోర్టు ఆపకుండా అగ్నిమాపకంలో అదెంత వరస్టో ఏ ఎక్స్‌పర్ట్ కమిటీతో రిపోర్టు తెప్పించాలి… రెండు వేల మంది పోలీసులను పెట్టాలి… మీడియాను దూరంగా ఉంచేయాలి… పైగా వారసత్వ కట్టడాలనే సెంటిమెంట్లు కూడా ఏమీలేవు… ఏ రేవంత్‌లాగే దాని కింద సొరంగం ఉంది, నేలమాళిగలో గుప్తనిధులు ఉన్నాయని కూడా చంద్రబాబు ఆరోపించడు, ఎందుకంటే కట్టింది తనే కాబట్టి…
సో, అప్పుడు కూల్చివేతలు స్టార్ట్ చేసి, వీలయితే ఓపూట రిపోర్టర్లను, ఫోటోగ్రాఫర్లను, వీడియోమెన్‌ను రెండు ఓపెన్ బిగ్ ఆటోల్లో కుక్కి, నియంత్రిత ఫోటోగ్రఫీకి ఆస్కారం కల్పించాలి… అంతే ఖేల్ ఖతం… కొత్త భవనాలు కడతాం అని చెప్పాలి… ఓ ముహూర్తం చూసుకుని, అబ్బే, ఇక్కడ ఏం కట్టినా వేస్టే అని చెప్పేసి, సచివాలయంతోపాటు అసెంబ్లీని కూడా విశాఖకే మార్చేయాలి… నవ్యాంధ్ర, స్వర్ణాంధ్రకు ప్రతీకగా ఓ కొత్త సమీకృత భవనాలు కడతాం అనాలి… కట్టడం స్టార్ట్ చేసేయాలి… ఎంతసేపూ ఆ శ్రీశైలం నీటిని తోడుకునే పోతిరెడ్డిపాడు పొక్క గురించి, రాయలసీమ లిఫ్టు గురించేనా..? ఇవీ కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి కదా… అబ్బే, ఇంకా ఎప్పుడు మారతావ్ బాస్…?!
No comments:
Post a Comment