Share this with Whatsapp
Image captionవివేకానందుడి అమెరికా స్నేహితురాలు, భక్తురాలు జోసెపైన్ మాక్‌లియోడ్ (వివేకానందుడికి ఎడమవైపు నిలబడిన మహిళ) భారత్ వచ్చినప్పుడు వివేకానందతో కలసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు
జనవరి 12వ తేదీ వివేకానందుని జన్మదినం. ఈరోజును 1984వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోంది.
1863లో కోల్‌కతాలో జన్మించిన నరేంద్రనాథ్, తదనంతర కాలంలో స్వామి వివేకానందుడిగా ప్రసిద్ధి చెందారు. వివేకానందుడి ప్రస్తావన ఎక్కడ వచ్చినా 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం ప్రస్తావన తప్పకుండా వస్తుంది.
ఈ ప్రసంగం భారత ప్రతిష్టను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ప్రసంగంలో వివేకానందుడు ఏం చెప్పారన్నది కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు.
వివేకానందుడి ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూద్దాం:
అమెరికా సోదరులు, సోదరీమణులారా.. నన్ను ఆహ్వానించడంలో మీరు ప్రదర్శించిన ఆత్మీయతతో నా హృదయం నిండిపోయింది. ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతికి నెలవు, అన్ని ధర్మాలకూ జనని అయిన భారతదేశం తరఫున నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. అన్ని కులమతాలకు చెందిన కోట్లాది మంది భారతీయుల తరపున మీకు కృతజ్ఞతలు.
మతసహనం అన్న భావన తూర్పు దేశాల నుంచి వచ్చిందని ఈ సదస్సులో వెల్లడించిన కొందరు వక్తలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Image copyrightSVMCM.WBHED.GOV.IN
మతసహనం, అన్ని మతాల పట్ల సమాన ఆదరణలాంటి లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పిన మతం నుంచి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మేం కేవలం మతసహనాన్ని నమ్మడమే కాకుండా, అన్ని ధర్మాలను నిజ రూపంలో స్వీకరిస్తాం.
నేను అన్ని మతాలకు, అణగారిన ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినైనందుకు గర్వపడుతున్నాను.
రోమన్ నిరంకుశ పాలకులు ఇజ్రాయిలీయుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేసినప్పుడు, ఇజ్రాయిలీ వాసులు దక్షిణ భారతదేశంలో తలదాచుకున్నపుడు వారిని మా హృదయాలకు హత్తుకున్నాం.
పార్సీ మతం వారికి ఆశ్రయం ఇచ్చిన మతానికి చెందిన వాడినైనందుకు నేను గర్విస్తున్నాను. మేం ఇప్పటికీ వారికి సహాయం చేస్తున్నాము.
ఈ సందర్భంగా నేను చిన్ననాటి నుంచి వింటున్న, అనేక లక్షల ప్రజలు ఇప్పటికీ చెప్పే మాటలను చెప్పాలనుకుంటున్నాను: ''నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాలలో పుట్టి, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరకు సముద్రంలో కలుస్తాయో... అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు. చూడడానికి ఈ దారులన్నీ వేరైనా, అవన్నీ కూడా దేవుణ్నే చేరుకుంటాయి.''
ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం. గీతలో చెప్పిన, ''నా దగ్గరకు వచ్చిన దేన్నైనా, అది ఎలాంటిదైనా, నేను దానిని స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను ఎంచుకుంటారు, కష్టాలను ఎదుర్కొంటారు. కానీ, చివరకు నన్ను చేరుకుంటారు'' అన్న వాక్యాలు దీనికి నిదర్శనం.
మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి.
ఆ భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది. ఈ సర్వమత సమ్మేళనం - అది కరవాలం ద్వారా కావచ్చు, కలం ద్వారా కావచ్చు - అన్ని రకాల మూఢభక్తిని, పిడివాదాన్ని, హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను