02 May 2020

పత్రికాధిపతుల ‘బొచ్చె’!


ఔను.. దేశంలోని పత్రికాధిపతులు బొచ్చె పట్టారు. బొచ్చె అనడం కన్నా పే..ద్ద భోషాణమే పట్టారంటే సముచితంగా ఉంటుందేమో! కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారు. ఏళ్ల తరబడి నింపుకున్న తమ ఖజానాలు దివాళా తీశాయంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా నష్టాల బాట పట్టినట్లు పత్రికాధిపతులు దేబిరించడమే ఈ వార్తా కథనపు విశేషం. వీళ్లు అడుగుతున్నది పదో పరకో కాదు… వేల కోట్ల రూపాయలు. వ్యవహారిక భాషలో చెప్పాలంటే తమ ఆదాయం దెబ్బతిందంటూ బిచ్చం అడుగుతున్నారు. గ్రాంథికంలో వివరించాలంటే భిక్షాందేహీ..,. అంటున్నారు. దేశంలోని పత్రికాధిపతులు ఇంకా ఏం కోరుతున్నారంటే..


పత్రికా రంగానికి ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీ అడుగుతున్నారు. లాక్ డౌన్ పరిణామాల వల్ల ఇప్పటికే రూ. 4 వేల కోట్ల రూపాయలను నష్టపోయామంటున్నారు. ప్రభుత్వం ఉపశమనం కలిగించకపోతే వచ్చే ఆరేడు నెలల్లో రూ. 15 వేల కోట్ల రూపాయల వరకు నష్టపోవలసి ఉంటుందట. గడచిన రెండు నెలల్లోనే రూ. 4,500 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయారట. ఇంకా అనేక రకాల నష్టాలను వివరిస్తూ పత్రికా సంస్థలకు రెండేళ్ల పన్ను విరామాన్ని కూడాప్రకటించాలని కోరారు. ‘బ్యూరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమ్యునికేషన్’ అడ్వర్టయిజ్మెంట్ల రేటును 50 శాతం పెంచాలంటున్నారు. ప్రింట్ మీడియా కోసం ఉద్దేశించిన బడ్జెట్ ను నూటికి నూరు శాతం పెంచాలంటున్నారు. ఆయా కోరికలతో పత్రికాధిపతుల తరపున ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది.

ఓకే… పత్రికాధిపతుల అవసరం పాలకులకు ఉండొచ్చు. రెండు నెలల్లోనే తమ రంగం దివాళా తీసిందంటూ బిచ్చమెత్తుకుంటున్న తరహాలో అభ్యర్థిస్తున్న పత్రికాధిపతులు కోరిక తీరనూ వచ్చు. నష్టాలపాలైన వారి ఖజానా నిండనూ వచ్చు. కానీ లాక్ డౌన్ పరిణామాల వల్ల వందలాది మంది జర్నలిస్టుల ఉద్యోగాలను తొలగిస్తున్న పత్రికా యాజమాన్యాలను కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుందా? ఇదేం పద్ధతని నిలదీస్తుందా? ఇప్పటికే ఇంటికి పంపిన అనేక మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తుందా? కోత విధించిన జర్నలిస్టుల వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆదేశిస్తుందా? పత్రికా పరిశ్రమలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం గల 30 లక్షల మంది కార్మికులను, సిబ్బందిని యథావిధిగా పత్రికాధిపతులు ఆదుకుంటారా? మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటారా? ఇటువంటి అనేక ప్రశ్నలకు ఉద్దీపన ప్యాకేజీ కోరుతున్న పత్రికాధిపతుల నుంచి జవాబులు లభించాల్సి ఉంది.

ఎందుకంటే కరోనా కల్లోలంలో తమను ఆదుకోవాలంటూ అనేక మంది కలం కార్మికులు ఆక్రోశిస్తున్నారు. ఐదు కిలోల బియ్యం, పప్పు, చింతపండు కోసం పలువురు జర్నలిస్టులు (జర్నలిజంలో కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారిన కొందరు మినహా) ‘అన్నమో రామచంద్రా..’ అంటున్నారు. అర్థాకలితో అలమటిస్తున్నారు. పరస్పర అవసరార్థం పత్రికాధిపతుల బొచ్చెను… కాదు కాదు… భోషాణాన్ని పాలకులు నింపవచ్చు. కానీ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వేదన చెందుతున్న పేద జర్నలిస్టులను ఆదుకునేదెవరు? అదీ అసలు డౌటు.