23 August 2021

Angel Merkel

ఇలాంటి లీడర్ గురించి ముందెన్నడూ విని ఉండరు ! 

 ………………………………………………….

Great personality……………………………. ఏంజెలా మెర్కల్ గత 18 సంవత్సరాలుగా 8 కోట్ల జనాభా గల జర్మనీ దేశానికి చాన్సలర్ (అధ్యక్షురాలు) గా అత్యంత ప్రతిభావంతంగా పనిచేసి పదవీ విరమణ పొందారు.ఆమె పదవీ విరమణ వేళ దేశ ప్రజలందరూ ఒక్కటిగా కనీ,వినీ ఎరుగని రీతిలో వీధుల్లో, బాల్కనీల్లో, కిటికీల్లో నిలబడి ఆరు నిమిషాల పాటు అవిరామంగా చప్పట్లతో,  హృదయపూర్వకంగా వీడ్కోలు పలకడం విశేషం.

ఇది ఆమె అద్భుత నాయకత్వానికి, ప్రతిభా పాఠవాలకు .. మానవతా దృక్పథానికి నిదర్శనం.18 సంవత్సరాల క్రితం జర్మనీ దేశ ప్రజలు ఏంజెల్ మెర్కెల్ ను ఛాన్సలర్ గా ఎన్నుకొన్నారు. ఆమె తన ప్రతిభా పాఠవాలు, అకుంఠిత దీక్షతో , నిమగ్నత తో ప్రజల నమ్మకాన్నినిలబెట్టారు. దేశ ఖ్యాతిని ఇనుమడింపు చేశారు. ఆర్థిక వ్యవస్థను మరింత బలపర్చారు. ప్రపంచ మహిళ గా పేరు పొందారు.

తన గుర్తింపు కోసం ఆమె ఏనాడు తాపత్రయ పడలేదు. కనీసం 18 సంవత్సరాల కాలంలో ఆమె ఒక్క సారి కూడా తన ఫోటోను ప్రభుత్వ పథకాల ప్రచారానికి కానీ, మరే ఇతర విశిష్టమైన ప్రచారాలకు గాని ఉపయోగించలేదు. తన పదవీ కాలంలో ఆమెపై ఎలాంటి అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు లేవు. తన బంధువులు ఎవరిని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించ లేదు. లక్షల్లో జీతాలు తీసుకోలేదు. వందిమాగదుల తో  తన గొప్పతనాన్ని పొగిడించుకోలేదు. తన పాలనలో ప్రజల నుండి ఎలాంటి నిరసనలు, డిమాండ్లు ఎదుర్కోలేదు. ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ప్రజాహితం గా దేశ ప్రజల అభ్యుదయం కోసం అహర్నిశలు నిష్టతో పని చేశారు.

తన కోసం ఎలాంటి ఆస్తిపాస్తులు ఏర్పరచుకోలేదు. కార్లు , స్థలాలు, విమానాలు కొనలేదు. ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం పై ఏనాడు ఆమె ఆసక్తి చూపలేదు. ఒక సాధారణ అపార్ట్మెంట్ లో  అదీ ఆమె ఛాన్సలర్ గా ఎన్నిక కావడానికి ముందు ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఎన్నికైన తర్వాత కూడా సాధారణ ప్రజల మాదిరిగానే నివసించారు. అది ఆమె గొప్పతనం.గత 18 సంవత్సరాల కాలంలో ఆమె వేషధారణ లో ఎలాంటి మార్పు లేదు రోజుకు రెండు మూడు డ్రస్సులు మార్చలేదు. పదవీ విరమణ సందర్భంగా పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన జవాబులు అందరినీ నివ్వెరపరిచాయి.

ఒక విలేకరి ” మీరు ప్రతిరోజూ ఒకే రకమైన డ్రెస్ వేస్తారు మీకు మరొక డ్రస్సు లేదా ” అన్న ప్రశ్నకు ” నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని మోడల్ ని కాదు” అంటూ సమాధానమిచ్చారు. “మీ ఇంట్లో ఇంటి పని, వంట పని ఎవరు చేస్తారు” అని మరొక విలేకరి ప్రశ్నించగా “తన ఇంట్లో పని మనుషులు ఎవరూ లేరని, తాను తన భర్త ఇద్దరూ కలిసి ఇంటి పనీ,వంట పనీ చేసుకుంటామని, రాత్రిళ్ళు ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది లేకుండా తమ బట్టలను తామే వాషింగ్ మిషన్లో వేసుకొని  ఉతుక్కుంటాం” అని సమాధానమిస్తూ.. ఆమె విలేకరులకు ఎదురుప్రశ్న వేసారు.

“మీ నుండి ఇలాంటి ప్రశ్నలు నాకు వస్తాయని నేను అనుకోలేదు.నా పదవీకాలంలో ప్రభుత్వ పనితనం, సక్సెస్, ఫెయిల్యూర్ వంటి అంశాల గురించి మీరు నన్నుఅడుగుతారు” అని నేను భావించాను అనడంతో  అక్కడ ఉన్న విలేకరులు అవాక్కయ్యారు.ఇలాంటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న నాయకులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు.