12 April 2019

జగన్‌తో కలుస్తాం, ప్రత్యేకహోదా ఇస్తాం.!

భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తుందట. 2014 నాటి మాట కాదిది. కొత్తమాట.! ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. విజయ్‌బాబు అనే ఒకప్పటి పొలిటికల్‌ అనలిస్ట్‌, న్యాయ నిపుణుడు, విద్యాధికుడు, ప్రస్తుత బీజేపీనేత అనూహ్యంగా ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి విజయ్‌బాబు రాష్ట్రస్థాయి ముఖ్యనేత కూడా కాదు. గతంలో ఆయన జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించారనుకోండి.. అది వేరే విషయం.


ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో విజయ్‌బాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఒకింత 'ఇష్టం' ప్రదర్శించారు. ఏమో, బీజేపీ నుంచి ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు వెళతారేమో.! రాజకీయాల్లో ఎప్పుడెవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. మొన్నటికి మొన్న కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడం అసాధ్యమని తేల్చేశారు. రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతోంటే, అరుణ్‌ జైట్లీ ఆ వ్యాఖ్యల్ని ఖండించేశారు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో బీజేపీకి ఖచ్చితమైన అవగాహన వుంది. ఆ అవగాహనతోనే రాష్ట్రాన్ని తొక్కిపెట్టింది బీజేపీ ఇప్పటిదాకా. అయితే నిన్న మొన్నటిదాకా ప్రత్యేకహోదా దండగ.. అని గళం విప్పిన విజయ్‌బాబు, ఇప్పుడెందుకు ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కి వస్తుందనీ, వైఎస్‌ జగన్‌ - బీజేపీతో కలవడం ఖాయమనీ చెబుతున్నారట.? ఏమో, ఆయనకే తెలియాలి.

ఇదే విజయ్‌బాబు, బీజేపీలో చేరకముందు వైఎస్‌ జగన్‌పై తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో జనసేన తరఫున అవినీతి ఆరోపణలు చేసిన విషయాన్ని మర్చిపోలేం. అయితే, ఇక్కడ ఓ విషయం సుస్పష్టం. కేంద్రంలో సరైన మెజార్టీ రాకపోతే, బీజేపీకి ప్రాంతీయ పార్టీల అవసరం వుంటుంది. ఆ అవసరం ఏర్పడితే, ప్రత్యేకహోదా అనే అంశాన్ని అడ్డం వేసి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాయాన్ని బీజేపీ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కానీ, బీజేపీని వైఎస్‌ జగన్‌ ఎంతవరకు విశ్వసిస్తారన్నదే ఇక్కడ కీలకం. ప్రత్యేకహోదా ఇస్తే, వైఎస్‌ జగన్‌ - బీజేపీకి మద్దతివ్వొచ్చుగాక. కానీ, అలా ఇవ్వాలంటే బీజేపీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, ఎలాగూ బీజేపీ ప్రత్యేకహోదాకి ఇంకోసారి పాతరేస్తుందనుకోండి.. అది వేరే విషయం.