09 October 2019

ఆర్టీసీ జేఏసీ నేతపై కేసీఆర్ గురి.. హరీష్‌రావుపై అనుమానం?

ఆర్టీసీ జేఏసీ నేతపై కేసీఆర్ గురి.. హరీష్‌రావుపై అనుమానం?


ఆర్టీసీ జేఏసీ నేతపై కేసీఆర్ గురి.. హరీష్‌రావుపై అనుమానం?

తెలంగాణలో టీఎస్ఆర్టీసీ సమ్మె వెనుక దాగిన ప్రతీప శక్తుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వేట మొదలెట్టేశారా? ఆర్టీసీ సమ్మెపట్ల కఠిన వైఖరి అవలంబించడానికి కేసీఆర్‌కి తనదైన బలీయమైన కారణాలున్నాయా? ఇంటి శత్రువే తన ప్రభుత్వ ప్రతిష్టకు గండి కొట్టడానికి సమ్మెను సాకుగా వాడుకుంటున్నాడని కేసీఆర్ అనుమానిస్తున్నారా.. ఈ మూడు అంశాల్లో దేంట్లో నిజమున్నా టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం గురిపెట్టి దెబ్బతీయడం ఖాయమని స్పష్టమవుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు, ఉద్యోగుల యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇ. అశ్వత్థామ రెడ్డిపై కేసీఆర్ ప్రత్యేకంగా గురి పెట్టినట్లు తెలుస్తోంది. కార్మికులు సమ్మెను తీవ్రతరం చేసేలా  రెచ్చగొడుతోంది, తన ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయడానికి మీడియాను వాడుకుంటున్నది అశ్వత్థామ రెడ్డేనని అర్థమవడంతో కేసీఆర్ ఉగ్రుడవుతున్నారని సమాచారం.
అశ్వత్తామరెడ్డిపే కేసీఆర్‌కు అనుమానం ప్రబలడానికి బలీయమైన కారణం ఉంది. ఎందుకంటే అశ్వత్థామ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు వత్తాసు ఉందన్నది బహిరంగ రహస్యమే. దీనికి తగిన రుజువు కూడా ఉంది మరి. గత కొద్దినెలల క్రితం వరకు హరీష్ రావు టిఆస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అశ్వత్థామరెడ్డి కూడా ఈ సంస్థలోనే పనిచేశారు. పైగా తాను హరీష్ రావుకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు కూడా.
పైగా, గతంలోనూ ఆర్టీసీ కార్మికులు తమ జీతాలు పెంచమని డిమాండుతో ఆందోళనకు దిగినప్పుడు హరీష్ రావు వారి డిమాండును పరోక్షంగా బలపర్చారు. ఇది అప్పట్లోనే కేసీఆర్‌కు తీవ్రమైన ఇక్కట్లను తెచ్చిపెట్టింది. తర్వాత హరీష్ రావును మజ్దూర్ యూనియన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. 
ఆ తర్వాతే కేసీఆర్ అటు ఆర్టీసీలోని ట్రేడ్ యూనియన్ల పైనా, ఇటు సింగరేణి కార్మికుల యూనియన్ల పైనా నిషేధం విధించాలని బలంగా నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు సహనం కోల్పోయిన కేసీఆర్ వెంటనే సమ్మెపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేశారు.
అంతకంటే మించి తన మేనల్లుడు, ఆర్థిక మంత్రి హరీష్ రావే ఆర్టీసీ సిబ్బంది సమ్మె వెనుక ఉన్నారని కేసీఆర్ బలంగా అనుమానిస్తున్నారని సమాచారం. పైగా వనపర్తి నియోజక వర్గంనుంచి పోటీ చేసిన ఎస్ నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆయన ఓటమికి కూడా అశ్వత్థామరెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడని కేసీఆర్‍‌కి ఉప్పందింది. నిరంజన్ రెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచి వ్యవసాయం మంత్రిగా ఉన్నారనుకోండి.
ఈ అన్నీ కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె పట్ల కఠిన వైఖరి అవలంబించడానికి కారణమయ్యాయని సమాచారం. ఇది నిజమే అయిన పక్షంలో కేసీఆర్ తక్షణ టార్గెట్ అశ్వత్థామ రెడ్డే అని నొక్కి చెప్పాల్సిన పని లేదు కదా.. అశ్వత్థామ రెడ్డి కూడా తన ఉద్యోగం పోయినా సరే ఆర్టీసీ కార్మికుల పక్షాన్నే ఉంటానని కొద్ది రోజుల క్రితం చెప్పడం తెలిసిందే.