నా పేరు జర్నలిస్టు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే ఉంది. మా ఆఫీసులో నేనేమి రాసినా పేరు లేకుండానే రాయాలి. పేరు లేకుండానే బతకాలి. దాంతో నా పేరు నాకే అంత అవసరం లేనిదయ్యింది. అలాంటిది ఇక నా పేరుతో మీకేమి పని? మా ఊరిలో తప్ప దేశంలో నేను ఎక్కడయినా పని చేయడానికి అర్హుడిని అన్న మా మేనేజ్మెంట్ జర్నలిజం వృత్తిగత ప్రాథమిక సూత్రాల ప్రకారం నా ఊరు నాది కాదు. కాబట్టి దానితో మీకు కూడా పనిలేదు.
జర్నలిజం చదువుకుని, ఉస్మానియా చెట్ల కింద అర కప్పుల చాయ్ తాగుతూ పోటీ పరీక్షలు రాసి రాసి అలసి సొలసి జర్నలిజంలోకి వచ్చానా? ఇష్టపడి జర్నలిజంలోకి వచ్చానా? వచ్చాక కష్టపడి జర్నలిజం నేర్చుకున్నానా? నేర్చుకోక కష్టపడుతున్నానా? అన్న ప్రశ్నలకు నేనిప్పుడు సమాధానాలు వెతుక్కునే స్థితిలో లేను.
అందరూ పడుకుంటే నేను మేల్కొన్నాను. అందరూ మేల్కొంటే నేను పడుకున్నాను. అక్కడే నేను ప్రపంచానికి దూరమయ్యాను. ప్రపంచం కళ్లు తెరిపించే పనుల్లో నా కళ్లు మూసుకుపోతున్న విషయం నేను గ్రహించలేదు. గ్రహించే జ్ఞానం వచ్చేసరికి చేతులే కాకుండా మొత్తం శరీరం కాలుతోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. అలాంటిది శరీరమంతా కాలుతుంటే ఏ చెట్టూ నన్ను రక్షించలేదు. మానులుగా ఎదిగిన యజమానుల నీడలో ఇక ఏ చెట్టూ ఎదగదు. ఎదగకూడదు. పెరటి చెట్టు ఎలాగూ నా వైద్యానికి పనికిరాదు.
“నాకు ఉగాదులు లేవు. ఉషస్సులు లేవు.
నేను అనంత లోక శోక భీకర తిమిరైక పతిని”.
ఇన్నాళ్లూ ప్రపంచం బాధ నా బాధ. ఇప్పుడు నా బాధ ప్రపంచం బాధ కాకుండా పోయింది.
నా ఉద్యోగం ఉంటుందో? పోతుందో? తెలియదు. జీతం నెల నెలా వస్తుందో? రాదో? తెలియదు. ముప్పయ్ శాతం అంటే ముప్పయ్ శాతం కట్ చేసి డెబ్బయ్ శాతం జీతం ఇస్తారనుకున్నా. డెబ్బయ్ శాతం జీతం కట్ చేసి ముప్పయ్ శాతమే ఇస్తారని బ్యాంకులో పడేదాకా తెలియలేదు. ఆ ముప్పయ్ శాతమయినా ఇవ్వని కంపెనీలతో పోలిస్తే మా యజమాని దేవుడు. ఆయన, ఆయన భార్యా పిల్లలు చల్లగా ఉండాలి.
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సాఫ్ట్ వేర్ లాగా ఏవేవో కలలు కన్నా. వర్క్ ఉంటేనే ఫ్రమ్ హోమ్ అని మా హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ తెలుగులో ఏడు విభక్తుల్లో లేని కొత్త విభక్తిని ఆ మాటకు వెతికి చెప్పింది. నిజమే. ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రితం రాసుకున్న విభక్తి ప్రత్యయాలు ఇప్పుడెలా సరిపోతాయి?
ఇక వర్క్ ఉంటేనే ఉద్యోగం. యజమానికి డబ్బులొస్తేనే ఉద్యోగం. ధర్మం కూడా. ఇన్నేళ్లలో యజమాని ఆర్జన ఈ ముష్టి మూడు నాలుగు నెలల తరుగుదలను తట్టుకోలేదా అన్నది అర్థం లేని ప్రశ్న. ఆర్థిక లాభనష్టాల శాస్త్రం అడగకూడని ప్రశ్న. ఆదర్శాల క్రస్ట్ గేట్లు రోజూ ఎత్తేవారిని మాటమాత్రంగా కూడా అనకూడని స్థితి.
మా పిల్లలు పెద్దవారయ్యారు. కాలేజీలు. డొనేషన్లు. ఫీజులు. ఇంటి లోన్, వెహికిల్ లోన్ ఈఎంఐలు. అనారోగ్యాలు. ఆసుపత్రుల ఖర్చులు. అంతా అగమ్యగోచరంగా ఉంది. నేను జర్నలిస్టును కాకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు నన్ను నేను రద్దు చేసుకుంటున్నాను. నేను మనిషిగా మిగిలి ఉండడానికి దారులు వెతుక్కుంటున్నాను. నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తప్ప నాకిప్పుడు ఏ ఆదర్శాలూ లేవు. ఉన్నా నాకవసరం లేదు.
ఉసురు తగిలి పోతారని తెలుగులో చేతకానివారు అనుకోవాల్సిన చేతకాని మాట. మా మనసులో మౌనంగా తిట్టుకున్నా దాన్ని అక్షరాల్లోకి అన్వయించే నిగూఢ గూఢచర్య సాఫ్ట్ వేర్ మీదగ్గరుందన్న ఎరుక మాకుంది. కాబట్టి స్వగతంలో కూడా కసితీరా తిట్టుకోలేని దీనులం. పేద జర్నలిస్టు కోపం పదవికి చేటు.
అక్షరం అంటే నాశనం లేనిది అని చాలా లోతయిన అర్థమేదో ఉన్నట్లుంది. మేము క్షయమవుతూ మేము రాసే అక్షరం మాత్రం క్షయం కాకుండా ఉండడం ప్రకృతి సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? అయినా నోట మాట లేని నిర్ వచనంగా పడి ఉండాల్సిన వాళ్లం. మాటల నిర్వచనాలు మాకెందుకు?
కరోనా త్వరగా చచ్చి మళ్లీ మీకు పూట పూటా కోట్లకు కోట్లు వచ్చి మా వంద శాతం జీతం మాకొస్తే చాలు.
భగవంతుడా!
మా యజమానికి ఏ కష్టం, ఏ నష్టం కలగకుండా చూడు స్వామీ!
అన్నట్లు- మొన్న మా సెక్షన్ హెడ్ కరోనా జ్వరం వచ్చినా కర్తవ్య నిష్ఠతో, తదేక దీక్షతో, మొక్కవోని ధైర్యంతో నాలుగు రోజులు అలాగే తుమ్ముతూ దగ్గుతూ ఆఫీస్ కు వచ్చి ఇంకో నలభై మందికి కరోనా వాయనం ఇచ్చారు. ఇంకో చోట ఇది జరిగి ఉంటే మనకు పెద్ద వార్త. అది వార్త కాకుండా పోయిందని జర్నలిజం నైతిక ప్రమాణాల గురించి కాదు నా బాధ. ఆ నలభై మందిలో నేను కూడా ఒకడిని అన్నదే నా బాధ. నా వల్ల నా భార్యా పిల్లలకు కూడా సోకింది. అయినా నేను సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని మౌన క్వారంటైన్ లో ఉండి- ఏది వార్త? ఎవరికి వార్త? ఏది ఎందుకు ఎవరికి ఎలా వార్త కాదు అని సైద్ధాంతికంగా నాలో నేనే చర్చించుకుంటున్నాను. మనం పోరాడాల్సింది రోగంతో కానీ- ఉద్యోగంతో కాదు-అన్న స్ఫూర్తిని వెలిగించిన మా హెడ్ ముందు నేను సిగ్గుతో హెడ్ దించుకుంటున్నాను.
నేను ఎన్నో వార్తలు రాశాను. హెడ్డింగులు పెట్టాను. అనువాదాలు చేశాను. ఎడిటింగులు చేశాను. సంపాదకీయాలు కూడా రాశాను. నా వార్త ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. నా వార్తకు శీర్షిక లేదు. ముగింపు ఉందో లేదో తెలియదు. ఎలా అనువదించుకోవాలో అంతుపట్టడం లేదు. నా జీతం ఎడిటింగ్ ఒక్కటే గుర్తొస్తోంది. నెల సంపాదన లేకుంటే సంపాదకీయం ఎలా రాయగలను?
లోకంలో ఎన్నెన్నో బాధలకు, కన్నీళ్లకు-
నిరాశ
నిస్పృహ
అడియాస
గోస
దేవులాట
తన్లాట/తనకులాట
యాసట
వైరాగ్యం
వేదన
ఆవేదన
సంవేదన
పరివేదన
రోదన
మౌన రోదన
ఆక్రందన
దుఃఖం
యాతన
బతుకు ఆరాటం
అస్తిత్వ పోరాటం
సంఘర్షణ
అంతర్మథనం
కోపం
ఉక్రోషం
నిస్సహాయత
వ్యథ
వ్యాకులత
శోకం
కష్టాలు
కడగండ్లు
ఇబ్బందులు
ఆపదలు
అగచాట్లు
దోర్బల్యం
దీనావస్థ
దుస్థితి
దురవస్థ
వెట్టి చాకిరి
గొడ్డు చాకిరి
గాడిద చాకిరి
కాంట్రాక్ట్ కొలువు
అవుట్ సోర్సింగ్ కొలువు
సెలవుల్లేని కొలువు
సెంటీ మీటర్ వార్తల కొలువు
మిల్లీ మీటర్ వార్తల కొలువు
యాడ్స్ తెస్తేనే కొలువు
ఒట్టి ఐ డి కార్డ్ కొలువు
సంక్షోభం
వైపరీత్యం
వైక్లబ్యమ్
విధి విలాసం
విధి వంచితులు
బాధాసర్పదష్టులు
కన్నీరింకిన బతుకులు
అగమ్యగోచరం
నడి సంద్రంలో నావ
చుక్కాని లేని నావ
తెగిన గాలిపటం
గమ్యం లేని పయనం
కొన ఊపిరి
తుది ఆశ
దింపుడు కళ్లెం ఆశ
శ్మశాన వైరాగ్యం
వేదాంతం
కన్నీటి కథలు
దుర్భర వ్యథలు…అని కన్నీళ్ళకే కళ్లల్లో రక్తం వచ్చేలా రాశాను. ఈ మాటలన్నీ ఒకేలా అనిపించినా ఒకటి కాదు. అర్థంలో తేడాలున్నాయి. ఇందులో ఏయే మాటలు నాకిప్పుడు అన్వయం అవుతాయో నాకే తెలియడం లేదు.
ఇప్పుడు నామీద నేనే రాసుకోలేని,
నాకు నేనే అర్థంకాని ఒకానొక వార్తను.
ఓ జర్నలిస్టు
$$$$$$$$$
No comments:
Post a Comment